పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం: జూపల్లి

కలం, నాగర్ కర్నూల్: ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు మోటార్లను మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ప్రారంభించారు. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అండగా నిలుస్తామని పునరుద్గాటించారు. గత పాలకులు పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నుల‌ను పూర్తి చేయ‌కుండానే జాతికి అకింతం చేశార‌ని ఎద్దేవా చేశారు. కానీ కాలువ‌లు, డిస్ట్రిబ్యూట‌రీ కెనాల్స్, ఇత‌ర ప‌నుల‌ను కూడా గత ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. ప్రాజెక్టులను గత పాలకులు పూర్తిచేసి ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి తలెత్తేది కాదన్నారు.

వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని ఘాటుగా స్పందించారు.

మహాత్మాగాంధీ–కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 4.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని పేర్కొన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, భీమా ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని వివరించారు. పాలమూరు రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ ప్రచారానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను గత ప్రభుత్వం పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందో చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.

రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిన గత పాలకులు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల పురోగతిపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం టీఆర్ఎస్ నాయకులకు సరికాదన్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం మేర‌కు సాగునీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు. ప్రాజెక్టుల వారీగా సమస్యలను గుర్తించి, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చడం, వ్యవసాయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>