విత్తనోత్పత్తిపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన

కలం, జోగులాంబ‌ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాను నాణ్యమైన విత్తనోత్పత్తికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రైతులు ముందుకు రావాలని నాబార్డ్ (NABARD) ఏజీఎం మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ శివారులోని రైతు ఎస్.రామ్ రెడ్డి పొలంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. పి. అర్చన ఆధ్వర్యంలో నాబార్డ్ ప్రాజెక్టు కింద వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన నాబార్డ్ ప్రాజెక్టు లక్ష్యాలు, సహకార సంఘాల ద్వారా అమలు చేస్తున్న విత్తనోత్పత్తి కార్యక్రమాల ప్రయోజనాలను వివరించారు.నాబార్డ్, సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ సమన్వయంతో నాణ్యమైన విత్తనోత్పత్తిని విస్తరించి రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు స్వయంగా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీల ద్వారా విత్తనోత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. జిల్లా సహకార అధికారి టైసన్ పాల్ మాట్లాడుతూ.. బ్రీడర్ విత్తనాల ప్రాముఖ్యతను, సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి చేపట్టడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి శీలత మాట్లాడుతూ విత్తనోత్పత్తి రైతులకు లాభదాయకమైన ఆదాయ మార్గమని, స్థానికంగా నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంచాలని సూచించారు. రాబోయే రబీ సీజన్‌లో మినుము విత్తనోత్పత్తికి రైతులు ముందుకు రావాలని పుటందొడ్డి పీఏసీఎస్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి కోరారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం.కోఆర్డినేటర్ డా. పి. ఆర్చన మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో బ్రీడర్ విత్తనోత్పత్తి చేపట్టిన ప్రగతిశీల రైతు శ్రీ ఎస్. రామ్ రెడ్డిని అభినందించారు. ఇతర రైతులు కూడా నాణ్యమైన విత్తనోత్పత్తిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను వివరిస్తూ పెసర, మినుము, జొన్న వంటి తక్కువ కాలపరిమితి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఏఈఓ నరేష్ బ్రీడర్, ఫౌండేషన్,సర్టిఫైడ్ విత్తనాల మధ్య తేడాలు, విత్తన శుద్ధి, ధృవీకరణ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతు ఎస్. రామ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రబీ సీజన్‌లో తనకున్న సాగునీటి సౌకర్యంతో 10 ఎకరాల్లో మినుము విత్తనోత్పత్తి చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సభ్యులు అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>