మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కుట్ర : లక్ష్మీకుమారి

కలం, ఖమ్మం బ్యూరో : మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు (Women Reservation Bill) లోని లోపాలను సరిచేయాలని, మహిళలకు రిజర్వేషన్ అమలు చేయడం లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కాలయాపన విధానం నీచమైన రాజకీయ కుట్ర అని జిల్లా భారత జాతీయ మహిళా సమాఖ్య కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి విమర్శించారు. కొత్తగూడెం (Kothagudem) లోని రామాటాకీస్ రోడ్డులో శుక్రవారం మహిళా రిజర్వేషన్ బిల్లులోని అభ్యంతరకర అంశాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ సర్కారు మహిళా రిజర్వేషన్లను.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టి దాని అమలును ప్రశ్నార్థకంగా మార్చిందని మండిపడ్డారు.

1960వ దశకంలో ఎంపీ రేణూ చక్రవర్తి, 90వ దశకంలో గీతా ముఖర్జీ వంటి కమ్యూనిస్టు యోధులు చేసిన పోరాట ఫలితమే ఈ రిజర్వేషన్లని, కానీ నేడు ప్రభుత్వం తన రాజకీయ అజెండా కోసం పార్లమెంటరీ నిబంధనలను తారుమారు చేస్తూ మహిళా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ, మహిళా సంక్షేమంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపుతూ, డీలిమిటేషన్ పేరుతో మహిళా శక్తిని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిని ప్రజలు గుర్తించి ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకురాలు ఈసంశెట్టి పద్మజ, మావిడాల ధనలక్ష్మి, పోలుమూరి ధనలక్ష్మి, మునిగడప పద్మ, సత్తెనపల్లి విజయలక్ష్మి, పైడిపల్లి లక్ష్మి, షేక్ షాహిన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>