కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలో రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.4.5 లక్షల విలువైన 28.565 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలను జనగామ (Jangaon) పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పండరీ చేతన్ వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గరిపల్లి సత్యనారాయణ (47), గోడుగు నాగరాజు (38) డెకరేషన్ పనులు చేస్తూ పగలు జీవనం కొనసాగిస్తూ, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సత్యనారాయణపై హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం. జనగామ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని గస్తీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, గుండ్లగడ్డ ప్రాంతంలో చేసిన దొంగతనాన్ని అంగీకరించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు బంగారు గొలుసులు (15.674 గ్రాములు), బంగారు ముక్కు పుడక (5.024 గ్రాములు), రెండు జతల బంగారు చెవి కమ్మలు, బుట్టలు 7.867 గ్రాములు మొత్తంగా 28.565 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు
ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ఇంట్లో విలువైన నగదు, బంగారం ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

