కలం, వనపర్తి: వనపర్తి(Wanaparthy) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చేరికలు కొనసాగుతున్నాయి. వనపర్తి మండలం వెంకటాపురం, కందిరీగ తండా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వనపర్తి పట్టణంలోని నందిహిల్స్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వెంకటాపురంలో 122 మంది కాంగ్రెస్లో చేరిక
వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మద్దిలేటి భార్య శారద, బక్కమ్మ, వార్డు సభ్యులు శ్రీను, జయమ్మ తదితరులతో కలిపి మొత్తం 122 మంది కాంగ్రెస్లో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని, వారి అభివృద్ధికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కందిరీగ తండాలో 150 మందికి పైగా చేరిక
వనపర్తి మండలం కందిరీగ తండాకు చెందిన బీజేపీ సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ సరోజ, హీరా సింగ్తో పాటు పలువురు వార్డు సభ్యులు, గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతకు తగిన గుర్తింపు, సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగరాజు, మాజీ సర్పంచులు రాములు, మురళి, గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

