కలం, వనపర్తి: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రజల మన్ననలు పొందిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి (Panduga Sayanna Jayanti) వేడుకలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన పండుగ సాయన్న ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర, పోరాటాలు, సమాజానికి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

