కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు జరగబోతున్న నేపథ్యంలో పలువురు వైసీపీ (YSRCP) నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మెహిత్రెడ్డికి నోటీసులు ఇచ్చి ఇంటికే పరిమితం చేశారు.
రెండు పార్టీల నేతలపై..
బుధవారం జరిగిన అల్లర్లు, ఘర్షణలపై పోలీసులు వైసీపీ, టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి. కడపలో ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తూ.. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

