కలం, నిజామాబాద్ బ్యూరో: గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) తెలిపారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం జిల్లాలోని వివిధ పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన కోసం అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.
త్రివేణి సంగమ ప్రాంతం అయిన రెంజల్ మండలం కందకుర్తి వద్ద, నవీపేట మండలం యంచ వద్ద గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు కందకుర్తి వద్ద నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రూ. 6.05 కోట్ల అంచనా వ్యయంతో పుష్కర ఘాట్ నిర్మాణానికి, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ.3.90 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణాలకు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 5.00 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా యంచ వద్ద రూ. 2.15 కోట్ల నిధులతో పుష్కర ఘాట్, రూ. 70 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అట్టహాసంగా నిర్వహించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఒక్క కందకుర్తి పుష్కర క్షేత్రం వద్దనే అన్ని శాఖల పనులను కలుపుకుని సుమారు 30 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామని వివరించారు. భక్తుల రాకపోకలు, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, దుస్తులు మార్చుకునే గదులు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా, సురక్షితమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాగా, పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కర ఘాట్ల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలని అన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, తహసీల్దార్లు శ్రవణ్, వెంకట రమణ, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

