కలం, రామగుండం: సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
రాజకీయ లబ్ధికి కుట్ర..
సింగరేణి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి కార్మికులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మికులకు 34 శాతం లాభాల వాటా, రూ. కోటి బీమా సౌకర్యం కల్పించామని, మారుపేర్ల సమస్య పరిష్కారానికి మరియు డిస్మిస్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రాంతీయ వివక్ష..
రామగుండం ప్రజల కష్టార్జితంతో సిరిసిల్ల, సిద్దిపేటలను అభివృద్ధి చేసుకుని.. రామగుండం ప్రాంతాన్ని మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ మలిదశ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి, తెలంగాణ గొంతుక గద్దర్ అన్న అమరత్వాలను గౌరవించని కేటీఆర్, కేవలం స్వార్థ రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సొంతింటి కల నెరవేర్చడం, ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

