కలం, భువనగిరి : భువనగిరి పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్థానిక జూనియర్ కళాశాల మైదానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil) స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైదానంలో వాకింగ్ చేస్తున్న స్థానిక ప్రజలతో మమేకమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడ కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు, వాకర్స్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మైదానంలో తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు, విద్యుద్దీపాల సౌకర్యం, వాకర్స్ ట్రాక్ అభివృద్ధి, మరుగుదొడ్ల నిర్మాణం, వాహనాల పార్కింగ్ సదుపాయాలను కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం, మార్నింగ్ వాక్ కోసం వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అల్పాహారం చేస్తూ పలు స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

