కలం, నల్లగొండ బ్యూరో: ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించి ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించవచ్చని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి (MLA Bathula Laxma Reddy) తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గతేడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 350 మంది మృతి చెందగా, వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించని వారేనని తెలిపారు. అవగాహన కార్యక్రమాల అనంతరం హెల్మెట్ లేని వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గతేడాది మిర్యాలగూడ డివిజన్‌లో 93 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా మొదటిసారి రూ.25 వేలు రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ.1 లక్ష వరకు పరిహారం అందిస్తారని తెలిపారు. ఇటీవల జిల్లాలో వెంకన్నకు రూ.25 వేల పరిహారం అందిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు.
హైవేల్లో మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బీఎల్ఆర్
అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతున్నందున ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు సహాయం అందించడంలో పోలీస్ కేసులు అవుతాయని భయపడుతున్న ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్యాలగూడలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించడం కంటే.. హెల్మెట్ కొనుక్కొని వస్తేనే వాహనం ఇవ్వాలని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, వన్ టౌన్ సీఐ నాగభూషన్, టూ టౌన్ సీఐ సోమనరసయ్య, రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరు సుధాబాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, ఆర్టీవో, ఆర్టీసీ డీఎం, వైద్యాధికారులు, డ్రైవర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

