తాగునీటికే ప్రయారిటీ.. జిల్లాలవారీగా మంత్రి సీతక్క రివ్యూలు

కలం, తెలంగాణ బ్యూరో: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి (drinking water) ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం ఫీల్డు నుంచి వచ్చే రిపోర్టులపై మాత్రమే ఆధారపడకుండా గ్రామాల నుంచి కూడా విడిగా నివేదికలను తెప్పించుకుంటున్న ఇంజనీర్-ఇన్-చీఫ్ వాస్తవిక పరిస్థితికి అనుగుణంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. రోజువారీ రిపోర్టులను రివ్యూ చేస్తూ ఇబ్బంది తలెత్తిన వెంటనే దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతున్నారు. దీనికి తోడు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (Minister Seethakka) సైతం అధికారులతో నిరంతరం రివ్యూలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పంటలు కోతకు వచ్చినందున సాగునీటి అవసరాలు లేని ప్రాంతాల్లో తాగునీటికి అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర వాతావరణ విభాగం నుంచి అందే డైలీ రిపోర్టులకు అనుగుణంగా తాగునీటి ఇక్కట్లు లేకుండా అధికారులను అప్రమత్తం చేసే వ్యవస్థ అమలవుతున్నది.

సర్పంచ్‌ల నుంచి ఎప్పటికప్పుడు సమాచార సేకరణ :

అన్ని పంచాయతీల నుంచి సెక్రటేరియట్‌లోని పేషీకి తాగునీటి సరఫరాపై డైలీ రిపోర్టులు అందుతున్నాయి. కేవలం రిపోర్టులపై మాత్రమే ఆధారపడకుండా సర్పంచ్‌ల నుంచి కూడా వివరాలను సేకరించడానికి ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పాటైంది. నేరుగా సర్పంచ్‌లే వారి పంచాయతీల్లోని తాగునీటి అంశాలను ఫోన్ ద్వారా తెలియజేయడం అధికారులకు ఉపయోగపడుతున్నది. ఏ గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో సర్పంచ్‌లు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇంజినీర్-ఇన్-చీఫ్ సహా అధికారులు సమీపంలోని డిపార్టుమెంట్ స్టాఫ్‌ను అలర్టు చేసి దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి ఈ మెకానిజం దోహదపడుతున్నది. దీంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలకు ఆస్కారం ఉండడం లేదన్నది పంచాయతీరాజ్ అధికారుల వాదన. వేసవి కాలం పూర్తయ్యేంత వరకు ఈ మెకానిజం పనిచేయనున్నది.

గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత మరో వ్యూహం అమలు :

వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఎలాగూ గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరుగుతాయని, కాలువల ద్వారా కూడా పుష్కలంగా నీరు అందుతుందన్నది ఇంజినీర్లు, అధికారుల అభిప్రాయం. వర్షాకాలంలో నీటి కొరత సమస్య లేకపోయినప్పటికీ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని, అప్పుడు క్లోరినేషన్ ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆ డిపార్టుమెంటు అధికారులు చెప్తున్న మాట. వేసవి ముగిసేంత వరకు మంత్రి జిల్లాలవారీగా రివ్యూ మీటింగులు కొనసాగిస్తారని, డైలీ రిపోర్టులే కాకుండా సర్పంచ్‌ల నుంచి అందే ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>