కలం, కరీంనగర్ బ్యూరో: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో పలు ప్రముఖ దేవాలయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సందర్శించారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ దుర్గాదేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం (Minister Ponnam Prabhakar) సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని దేవాలయాన్ని పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

