Mobile Popup Ad
Mobile Popup Ad

‘కక్షతో పామాయిల్ తోట ధ్వంసం’

కలం, ఖమ్మం బ్యూరో:  కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారమదంతో కక్షసాధింపు మాజీ ఎమ్మెల్యే, అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపక్ష నాయకులపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామంలో రాజకీయ కక్షతో మాజీ సర్పంచ్ తోటను ధ్వంసం చేశారని ఆరోపించారు.

పామాయిల్ తోట ధ్వంసం ​

మల్లయిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్‌కు చెందిన 5 ఎకరాల పామాయిల్ తోట ధ్వంసమైంది. అదే గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత తన తోటను ధ్వంసం చేశాడని నారం రాజశేఖర్ ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలో ఎంతో కష్టపడి తాను పామాయిల్ మొక్కలను నాటి పెంచుకుంటున్నానని చెప్పారు. అయితే రాత్రికి రాత్రే తన తోటలోకి చొరబడి పామాయిల్ మొక్కలను దారుణంగా నరికివేసి విధ్వంసం సృష్టించారని ఆయన ఆరోపించారు.

ఎంతో వ్యయప్రయాసల కోర్చి పెంచుకుంటున్న పంటను ఇలా రాజకీయ కక్షతో నాశనం చేయడం సరికాదన్నారు. ఈ ఉదంతం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మల్లయిగూడెం చేరుకున్నారు. నరికివేసిన పామాయిల్ తోటను క్షేత్రస్థాయిలో పరిశీలించి, జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుడు నారం రాజశేఖర్‌ను పరామర్శించి, బీఆర్ఎస్ పార్టీ పరంగా ఆయనకు పూర్తి అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా కల్పించారు.

ప్రజలు ఓట్లు వేసింది విధ్వంసానికి కాదు

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. “ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ప్రజాసేవ చేయడానికే తప్ప, ఇలాంటి రాక్షస విధ్వంసాలు సృష్టించడానికి కాదు. ఎవరూ ఇక్కడ శాశ్వతంగా అధికారంలో ఉండరనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి” అని హెచ్చరించారు. పంటను నాశనం చేసి, రైతును కోలుకోలేని దెబ్బతీసిన సదరు కాంగ్రెస్ నాయకుడిపై పోలీసులు వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జూపల్లి రమణారావు, మాజీ జెడ్పీటీసీ సున్నం నాగమణి, బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>