మండిన రైతు గుండె.. 20 ఎక‌రాల వ‌రి పంట‌కు నిప్పు!

కలం, జోగులాంబ‌ గద్వాల: ఆరుగాలం చెమటోడ్చి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట.. కళ్లముందే నీళ్లు లేక నకనకలాడిపోతుంటే ఆ రైతు గుండె ఎంతలా విలవిలలాడిందో! చుక్క నీరు దొరక్క, ఆక్రందనలు ఆలకించే నాథుడు లేక, చివరకు తాను ప్రాణంగా భావించిన పంట‌కే నిప్పు పెట్టాల్సి వ‌చ్చింది. ​జోగులాంబ గద్వాల జిల్లా, అల్లంపూర్ నియోజకవర్గం, రాజోలి మండలం మాన్ దొడ్డి (Mandoddi) గ్రామంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన‌ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది.

మాన్ దొడ్డి గ్రామానికి చెందిన రైతు (Mandoddi Farmer) ఉప్పరి మోహన్ సాగర్ ఎంతో ఆశతో, కష్టపడి అప్పులు తెచ్చి 20 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. ఎదిగిన పంట చేతికి వస్తే అప్పులు తీరి, కుటుంబం గడుస్తుందని ఆశపడ్డారు. కానీ కర్ణాటక నుంచి ఆర్‌డీఎస్‌కు రావాల్సిన సాగునీరు నిలిచిపోవడంతో దిగువన ఉన్న మోహన్ సాగర్ పంట పొలాలు నీరు అందక ఎండిపోవడం ప్రారంభించాయి. ​నోటిదాకా వచ్చిన కూడు నిలవదేమోనన్న భయంతో ఆ రైతు అధికారుల వద్దకు, ప్రజాప్రతినిధుల వద్దకు తిరగని రోజంటూ లేదు. “మా పంటను కాపాడండి స్వామీ” అని కాళ్లావేళ్లా పడి మొరపెట్టుకున్నా ఎవరి నుంచీ కనీస స్పందన కరువైంది.
​
దినదినాభివృద్ధి చెందుతూ ఎదిగిన పంట చుక్క నీరు లేక కళ్లముందే వాడిపోయి బూడిదవుతుంటే చూడలేక, అప్పుల భయం, అధికారుల నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురైన మోహన్ సాగర్ తన చేతులతోనే 20 ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టారు. ​సగం కాలిన పైరు వైపే చూస్తూ, “కన్నబిడ్డలా పెంచిన పంటను నా చేతులతోనే కాల్చుకోవాల్సి వచ్చింది. ఈ కడుపుకోత శత్రువుకు కూడా రాకూడదు” అని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు పలువురిని తీవ్రంగా కలచివేసింది. రైతు దుస్థితి కేవలం ఒక్కరిది కాదు… నీటి ఎద్దడితో నష్టపోతున్న ఆయకట్టు రైతులందరి ఆక్రందన అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, బాధితుడైన రైతు ఉప్పరి మోహన్ సాగర్‌కు పూర్తిస్థాయి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>