కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు రూపొందించిన ముందస్తు, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి. గౌతం సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ తాగునీటి సరఫరా, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, భూగర్భ జలాలు, ఉద్యానవన, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో ఎల్‌నినో ప్రభావాలు, పంటల పరిస్థితి, నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, ముందస్తు కార్యాచరణ, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై జిల్లాల వారీగా గురువారం ఈ సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా గౌతం మాట్లాడుతూ.. వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం, ఖరీఫ్ సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, భూగర్భ జలమట్టాలను సమీక్షించి, రానున్న అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. రైతులు రబీ సీజన్‌కు సిద్ధమవుతున్నందున నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులపై వాస్తవాలను వారికి వివరించాలని సూచించారు.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
వచ్చే వేసవిలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా రూపొందించిన ప్రణాళికలను సమీక్షించారు. వ్యవసాయం, సాగునీటి అవసరాలకు అధికంగా నీటిని వినియోగిస్తే తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని తెలిపారు.
ఇరిగేషన్ పథకాలపై సమీక్ష
జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు పరిధిలో పంటల పరిస్థితి, సాగునీటి సరఫరాపై సమీక్షించారు. వారాబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నామని, వానాకాలం పంటలకు ఐదు తడుల నీరు అవసరమని, రానున్న రోజుల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, రబీ పంటలకు సాగునీరు అందించడం కష్టసాధ్యమని నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (కేఎల్ఐఎస్) పరిధిలో మూడు పంపుల నిర్వహణ, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఒక పంపునకు 24 గంటలు, మిగతా రెండు పంపులకు 18 గంటల చొప్పున విద్యుత్ సరఫరా జరుగుతోందని అధికారులు వివరించారు. పంపుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరాపై సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని గౌతం సూచించారు. జూరాల ఆయకట్టు పరిధిలో అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని వినియోగించడాన్ని అరికట్టేందుకు రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగు
జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం, గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ గ్రిడ్‌పై ఏర్పడుతున్న ఒత్తిడిని సమీక్షించారు. విద్యుత్ పొదుపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేస్తూ తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
నీటి సంరక్షణ పనులు
వీబీ-జీ రామ్ జీ పథకం కింద ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్ తదితర నీటి సంరక్షణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ పనుల ద్వారా భూగర్భ జలాల పెంపునకు తోడ్పడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి రోజులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి దశలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించి, వాటిని త్వరగా పూర్తి చేయడంతో పాటు రెండో దశలో ఇళ్ల మంజూరుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గౌతం సూచించారు. ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ సరఫరా, ఇసుక లభ్యతపై సమీక్షించారు. లబ్ధిదారులకు కంపెనీల నుండి నేరుగా దసరా నుండి సబ్సిడీపై సిమెంట్ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల నిర్మాణాలు త్వరగా పూర్తవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు రూపొందించిన ముందస్తు, ప్రత్యామ్నాయ ప్రణాళికలను సమర్థంగా అమలు చేయాలని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గౌతం సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, ఆదర్శ్ సురభి, సి.హెచ్. ప్రియాంక, షేక్ రిజ్వాన్ బాషా, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

