కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్ (West Indies) క్రికెట్కు మైదానంలో విజయాలు దక్కుతున్నా.. ఆర్థికంగా మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్ నేపథ్యంలో ఆ జట్టు ఆదాయ సమస్య మరోసారి చర్చకు వచ్చింది. భారత్లో జరిగే సిరీస్ ప్రసార హక్కుల ద్వారా భారీ ఆదాయం వచ్చినా.. అందులో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు వాటా ఉండటం లేదని ఆ బోర్డు సీఈవో డిర్క్ డెహ్రింగ్ గతంలో వివరించారు. ఈ సమస్యకు 1997లో తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అప్పటివరకు వెస్టిండీస్ జట్టుకు విదేశీ పర్యటనల ద్వారా కూడా మంచి ఆదాయం వచ్చేది. ఆ తర్వాత సిరీస్ నిర్వహించే దేశానికే ప్రసార ఆదాయంపై పూర్తి హక్కులు దక్కే విధానం అమల్లోకి వచ్చింది.
దీంతో భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశాలకు ఎక్కువ ఆదాయం సమకూరుతోంది. వెస్టిండీస్ వంటి చిన్న మార్కెట్ ఉన్న దేశాలకు మాత్రం ఆదాయం పరిమితమవుతోంది. ఆ నిర్ణయాన్ని వెస్టిండీస్ తీవ్రంగా వ్యతిరేకించినా.. ఓటింగ్లో 9–1 తేడాతో ఆ దేశం ఓడిపోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏటా 20 నుంచి 25 మిలియన్ డాలర్ల ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నట్లు ఇచ్చిన సమాచారం వెల్లడిస్తోంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆటగాళ్ల కాంట్రాక్టుల రిటైనర్ ఫీజుల్లో 25 శాతం కోత విధించే నిర్ణయం తీసుకుంది. భారత్ పర్యటన ముగిసిన తర్వాత ఆటగాళ్లు ఈ కోతలను అంగీకరించాలా, వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంది.

