NEET–CBSE అవకతవకలపై న్యాయ విచారణ జరపాలి: విద్యార్థి సంఘాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: AISF, PDSU, SFI వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులపై పోలీసులు జరుపుతున్న దమనకాండను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో విద్యా వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, పారదర్శకత లోపాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి, పరీక్షల వ్యవస్థను గందరగోళానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వం ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

తమ భవిష్యత్తును కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, విద్యార్థుల గళాన్ని అణచివేయడానికి పోలీసు బలగాలను ఉపయోగించడం అత్యంత నిరంకుశ చర్య అని అన్నారు. లాఠీలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని చూస్తే దేశ యువత సహించదని, విద్యార్థులపై దాడికి బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్రమంగా నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, నీట్, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరిపి, కుట్రలో ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారిని కాపాడే ప్రయత్నాలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం, అలాగే విద్యార్థులపై జరిగిన పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం అయిందని తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, యువజనులు, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సీతారం, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నందు, నాయకులు రాజు, రాజశేఖర్, పవన్, రాజశేఖర్, శేఖర్, శ్రీహరి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ‘వాంగ్‌చుక్’ మరో అన్నా హజారే.. సీజేపీ, కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>