కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భూభారతి పెండింగ్‌ల దరఖాస్తులు, మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులు, నాలా కన్వర్షన్, కోర్టు కేసులు, మ్యుటేషన్లకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, గ్రామాల్లో రీసర్వే పనుల పురోగతి, భూదాన్ భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియపై ఆమె సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న కేసులు, 60 రోజులకు మించి పరిష్కారం కాని దరఖాస్తులు, వాటి ప్రస్తుత స్థితి, రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలు, వాటి పరిష్కార పురోగతిని సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. అలాగే మండలాల వారీగా ఇప్పటి వరకు గుర్తించిన భూదాన్ భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
మీ సేవలో పెండింగ్‌లో ఉన్న కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులతో పాటు నాలా కన్వర్షన్, కోర్టు కేసులు, మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను కూడా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూత్పూర్, అడ్డాకల్, సీసీ కుంట, మహమ్మదాబాద్ మండలాల తహసీల్దార్లు సమర్థవంతంగా పనిచేసి పెండింగ్ దరఖాస్తులను గణనీయంగా తగ్గించడంపై కలెక్టర్ అభినందించారు. కోయిలకొండ, హన్వాడ, రాజాపూర్, మూసాపేట్ మండలాల తహసీల్దార్లు కూడా మంచి పురోగతి సాధించి పెండింగ్ దరఖాస్తులను చాలావరకు పరిష్కరించారని ప్రశంసించారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరగా పరిష్కరించాలని సూచించారు. మహబూబ్‌నగర్ అర్బన్, జడ్చర్ల, గండీడ్, నవాబుపేట, కౌకుంట్ల మండలాల్లో భూభారతి కింద ఎక్కువ సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు. సంబంధిత తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
రీసర్వే పనులను వేగవంతం చేయాలి
అనంతరం గ్రామాల్లో నిర్వహిస్తున్న రీసర్వే పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాల సహకారంతో రీసర్వే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకద్ర గ్రామంలో రీసర్వే పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్‌ను ఆదేశించారు. జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో రీసర్వే పనులు పూర్తయ్యాయని, అమ్మాపూర్ గ్రామంలో పనులు ప్రారంభించినట్లు జడ్చర్ల తహసీల్దార్ వివరించారు. హన్వాడ మండలం చీకురపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో రీసర్వే పనులు పూర్తయినట్లు ఆ మండల తహసీల్దార్ తెలిపారు. అడ్డాకల్, మూసాపేట్, సీసీ కుంట, గండీడ్, మహమ్మదాబాద్ తదితర మండలాల్లో రీసర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజూ లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు చేపట్టాలని, అక్టోబర్ 30 నాటికి ప్రతి గ్రామంలో కనీసం 300 ఎకరాల మేర రీసర్వే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సాండ్ బజార్ స్థల ప్రతిపాదనపై సమీక్ష
అనంతరం మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో సాండ్ బజార్ ఏర్పాటుకు గత సమావేశంలో ప్రతిపాదించిన స్థలం వివరాలను కలెక్టర్ సంబంధిత తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన ఫైల్‌ను ఏడీ మైన్స్, ఆర్డీఓలతో సంప్రదించి వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సాయి శివాని, ఆర్డీఓ నవీన్, భూమి రికార్డులు, సర్వే విభాగం ఏడీ అశోక్, మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

