కరీంనగర్ ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు

కలం, కరీంనగర్: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగికి మెరుగైన వైద్యం అందడమే కాకుండా.. పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra)  స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్‌)ను సందర్శించి, వార్డుల నుంచి మరమ్మతు పనుల వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంఎన్‌డబ్ల్యూ యూనిట్, మహిళా వార్డు, ఓపీ, సర్జికల్ తదితర విభాగాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీనతో కలిసి వార్డులకు వెళ్లారు.

మరమ్మతుల్లో నాణ్యతే గీటురాయి..

రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపడుతున్న మరమ్మతు పనులు నిర్దేశిత ప్రమాణాలతో సాగాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. టీజీఎంఐడీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, ప్యాచ్‌వర్క్‌లు, మరుగుదొడ్ల మరమ్మతులు, గదులు, కిటికీలకు సంబంధించిన పనులను పరిశీలించారు. పనులు పూర్తయ్యే వరకు నాణ్యతను పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల కారణంగా రోగులకు చికిత్సలో అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆధునిక వైద్య సదుపాయాలు..

గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స అందించేందుకు సుమారు రూ.6.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ మిషన్లు, క్రిటికల్ కేర్ సెంటర్‌ను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. వీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లపై వైద్యాధికారులతో చర్చించారు. ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

రోగుల వెంట వచ్చేవారికీ వసతులు..

రోగుల సహాయకుల కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.35 లక్షలతో ఏర్పాటు చేయనున్న విశ్రాంతి గదుల షెడ్డు పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేస్తూ, రోగుల సహాయకులకు ఉపయోగపడేలా సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆధునిక చికిత్సా సదుపాయాల వినియోగం.. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>