కాలువలో దూకి ప్రేమికుల సూసైడ్ అటెంప్ట్.. చివరికి..

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వేండ్ర గ్రామంలో సోమవారం అర్ధరాత్రి కాలువలో దూకి ప్రేమికుల ఆత్మహత్యయత్నం (Lovers Suicide Attempt) తీవ్ర కలకలం రేపుతోంది. తాము ఇక కలిసి జీవితాంతం ఉండలేమని భావించిన ప్రేమికులు మరణంలోనూ కలిసి ఉందామని అనుకున్నారు. తీవ్ర మనస్తాపంతో గుండెలు నిండిన బరువుతో తనువులు చాలించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఎవరూ లేని సమయంలో ఈ లోకం నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

పెద్దలు ఓకే..

పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన సందీప్ కుమార్ (22), భీమవరం గ్రామానికి చెందిన లలితాంబిక (20) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. లలితాంబిక భీమవరంలో ఆక్వా షాపులో పనిచేస్తుండగా.. సందీప్ చదువును కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయం ఇరువురి ఇంట్లో చెప్పగా వారు ఒప్పుకున్నారు. యువతి లలితాంబికకు తల్లితండ్రులు లేకపోవడంతో తన పెద్దమ్మ వద్ద పెరిగింది. కొన్ని రోజుల క్రితమే లలితాంబికను తన ఇంటికి తీసుకువెళ్లి తల్లితండ్రులకు సందీప్ పరిచయం చేశారు. సందీప్ అక్కయ్య వివాహం తర్వాత ఇద్దరి పెళ్లి చేస్తామని పేరెంట్స్ వారికి భరోసా కల్పించారు.

చచ్చిపోదాం..

అంతా ప్రశాంతంగా సాగిన వీరి జీవితంలో అనుకోని బాధ వెంటాడుతూనే ఉంది. లలితాంబికకు ప్రాణాంతకమైన వ్యాధి ఉండటంతో కలిసి జీవించలేమని.. ఇక మరణమే తమకు శరణ్యమని భావించారు. చావులోనూ నీకు నేను తోడుంటా అంటూ సదరు యువతికి యువకుడు దైర్యం చెప్పాడు. తమను మరణం కూడా విడదీయలేదని.. ఇద్దరం కలిసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వేండ్ర గ్రామంలోని అడవికోడు లాకులు వద్ద ఎవరూ లేని సమయంలో కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

యువతి గల్లంతు..

ఇది గమనించిన స్థానికులు యువకుడిని రక్షించగా.. కాలువ ఉధృతికి లలితాంబిక గల్లంతయింది. యువకుడిని భీమవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టగా .. కాలువలో లలితాంబిక మృతదేహం లభ్యమయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన ప్రేయసి మరణాన్ని తెలుసుకున్న యువకుడు.. గుండెలవిసేలా రోధిస్తున్నాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన నూతన జంట జీవితం దుఃఖ సాగరంలో మునిగిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>