కలం, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ‘F1: ది మూవీ’ (F1 The Movie) అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఎఫ్1’ సీక్వెల్‌పై ఫార్ములా వన్ స్టార్ లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఇప్పటికే సీక్వెల్ పనులను షురూ అయిపోయాయని వెల్లడించాడు. ఇప్పటికే కొత్త కథ కోసం స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ అయిందని తెలిపాడు. గత ఏడాది విడుదలైన ఈ సినిమాలో బ్రాడ్ పిట్ (Brad Pitt), డ్యామ్సన్ ఇద్రిస్ (Damson Idris) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు జోసెఫ్ కొసిన్స్కి (Joseph Kosinski) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత జెర్రీ బ్రుక్‌హైమర్‌తో పాటు ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన హామిల్టన్ కూడా నిర్మాతగా ఉన్నారు.
ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీకి ముందు మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో హామిల్టన్ మాట్లాడుతూ సీక్వెల్ కోసం మొదటి స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ఏడాది చివర్లో తాను, జెర్రీ బ్రుక్‌హైమర్, దర్శకుడు జోసెఫ్ కొసిన్స్కి కలిసి కథపై పలు ఆలోచనలు చర్చించినట్లు చెప్పారు. సినిమా మొదటి భాగం అనుభవం చాలా ఉత్కంఠభరితంగా ఉందని, ఇప్పుడు ఆ ప్రక్రియపై స్పష్టత వచ్చినట్లు పేర్కొన్నారు.
మొదటి చిత్రంలో బ్రాడ్ పిట్ ఒక అనుభవజ్ఞుడైన డ్రైవర్ పాత్రలో కనిపించారు. కష్టాల్లో ఉన్న ఫార్ములా వన్ జట్టును నిలబెట్టేందుకు ఆయనను తీసుకువచ్చే కథతో సినిమా సాగింది. యువ డ్రైవర్ పాత్రలో నటించిన డ్యామ్సన్ ఇద్రిస్‌తో ఆయన మధ్య ఉన్న విభేదాలు కథకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 630 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా క్రీడాభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఫార్ములా వన్ ప్రపంచాన్ని దగ్గర చేసింది అని హామిల్టన్ చెప్పారు. ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా చూసి స్పందనలు పంపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సీక్వెల్ విషయానికి వస్తే మంచి టీమ్, మంచి రచయిత ఉన్నారని హామిల్టన్ చెప్పారు. కథను సరిగా తీర్చిదిద్దేందుకు సమయం తీసుకుంటామని తెలిపారు. తాను సీక్వెల్‌లో నటించే అవకాశం గురించి ప్రశ్నించగా, కెమెరా ముందు కనిపించాలనే ఆసక్తి పెద్దగా లేదని హామిల్టన్ వెల్లడించారు. సినిమా వెనుకవైపు పనిచేయడం తనకు ఎంతో ఆసక్తికరమైన అనుభవంగా అనిపించిందని తెలిపారు. ఇక సీక్వెల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.

