కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ (Khila Warangal) మండల పరిధిలోని కరీమాబాద్‌లో భారీ అక్రమం వెలుగుచూసింది. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా, ప్రభుత్వ అధికారిక ముద్రను దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించిన వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. ఈ నకిలీ ధ్రువపత్రం ఆధారంగా విలువైన భూముల మ్యుటేషన్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నించారు.
రెవెన్యూ రికార్డులు, పంపిణీ రిజిస్టర్‌ను అధికారులు సమగ్రంగా పరిశీలించడంతో ఈ నకిలీ సర్టిఫికెట్ బాగోతం బయటపడింది. సదరు నంబరుతో ఎలాంటి సర్టిఫికెట్ జారీ కాలేదని నిర్ధారించుకున్న ఖిలా వరంగల్ తహసీల్దార్, ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు, ఈ మోసం వెనుక ఉన్న ముఠాపై దర్యాప్తు జరుపుతున్నారు.

