మోదంపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కలం, జడ్చర్ల : మోదంపల్లి (Modampally) గ్రామంలో హెచ్ఎండీఏ ద్వారా మంజూరైన రూ.1.33 కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Janampalli Anirudh Reddy) శనివారం శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని నిరుపేద లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన బాధ్యతని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గత ఎన్నికల సమయంలో పాదయాత్రలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు మోకాళ్ల లోతు నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశానని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయిస్తానని అప్పుడే హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ఈ పనులకు నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.  అదేవిధంగా, గ్రామంలోని దేవాలయానికి రూ.5 లక్షలు అందజేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆ మొత్తాన్ని అందించినట్లు తెలిపారు.

గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో రాకపోకలు సులభతరం కావడంతో పాటు, మురుగునీటి సమస్యలు తగ్గి పారిశుధ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>