కలం, వరంగల్ బ్యూరో: ప్రాణహిత నది నీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యాం నిర్మించాలని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ నెలాఖరులోగా నిర్మాణ పనులు చేపట్టకపోతే కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రాణహిత నది ప్రవాహాన్ని పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్ (Kannepalli Pump House) వద్ద ప్రాణహిత నీరు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ప్రవహిస్తోందని కవిత పేర్కొన్నారు. బ్యారేజీల మరమ్మతుల పేరుతో మూడేళ్లుగా వేల టీఎంసీల నీరు వృథా అయిందని విమర్శించారు. గతంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ సమస్య తీవ్రత పెద్దగా కనిపించలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో 21 వేల చెరువులు ఎండిపోవడంతో వాటిపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కన్నెపల్లి వద్ద కాఫర్ డ్యాం నిర్మిస్తే మేడిగడ్డ బ్యారేజీని బైపాస్ చేస్తూ నీటిని రిజర్వాయర్లకు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సుమారు రూ.25 కోట్లతో నెలన్నర రోజుల్లో పనులు పూర్తి చేయవచ్చని, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపడితే రైతులకు మేలు జరుగుతుందని సూచించారు.
ఈ పరిష్కార మార్గాన్ని రాష్ట్రంలోని నిపుణులతో చర్చించిన తర్వాతే ప్రతిపాదిస్తున్నామని కవిత (Kavitha) తెలిపారు. అన్ని పార్టీలు సమస్యపై పోరాటం చేస్తున్నా, తమ పార్టీ పోరాటంతోపాటు పరిష్కారాలను కూడా సూచిస్తోందన్నారు. ప్రభుత్వం రాజకీయ బేషజాలకు పోకుండా ప్రతిపాదనను పరిశీలించి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తమ సూచనలను సీరియస్‌గా తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read : జాతీయ స్టాక్ మార్కెట్లపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?
Follow Us On : WhatsApp

