కలం, వెబ్ డెస్క్: కాకినాడ (Kakinada) జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి (Kattipudi) వద్ద జాతీయ రహదారి–16పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన భవానీ మాలధారులు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి బస్సులో బయలుదేరారు. మార్గమధ్యలో కత్తిపూడి వద్ద సాంకేతిక లోపం రావడంతో బస్సు రోడ్డు పక్కన నిలిచిపోయింది.
బస్సు ఆగడంతో కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు పక్కకు వెళ్లారు. ఆ సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక స్కార్పియో కారు కాలినడకన వెళ్తున్న భక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి నలుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొక భక్తుడిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

