కలం, కరీంనగర్ బ్యూరో: పౌరుల ఓటు హక్కును హరించే హక్కు ఎవరికి లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి (Kasireddy Mani Kanta Reddy) అన్నారు. శనివారం కరీంనగర్ నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కసిరెడ్డి రెండోసారి ఎన్నికైన సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు కల్పించే ఎన్నికల సంఘం సర్ ప్రక్రియతో పౌరుల ఓట్లను హరిస్తుందని మండిపడ్డారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలను అడ్డుకోవడానికి విద్యార్థులు, యువత ముందుకు రావాలని మణికంఠ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా నుంచి దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది పేర్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జెన్ జీ యువ ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
సర్ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహించి జాతీయ ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని కసిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు ప్రైవేట్ విద్యాసంస్థలకు స్నాతకోత్సాలకు పోతున్నారు కానీ.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఎందుకు రారు? అని ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యాసంస్థల వారి నుండి ఎన్నికల నిధుల కొరకు వారికి ఇష్టానుసారంగా బీజేపీ దేశంలో, తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలంగాణ విద్యార్థి, యువత కోసం బీజేపీ చేసిందేమిటో అమిత్ షా చెప్పాలని అన్నారు.
రేవంత్ రెడ్డి ఏతుల రేవంత్ రెడ్డిగా మారాడని.. విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా విద్యాశాఖ తన వద్ద పెట్టుకొని నిర్లక్ష్యం చేస్తున్నాడని మణికంఠ రెడ్డి (Kasireddy Mani Kanta Reddy) విమర్శించారు. నీట్ ఉద్యమ స్ఫూర్తితో రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యలపై గల్లీ గల్లీ తిరిగి విద్యార్థులను ఏకం చేసి పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన విఫలమైందని చెప్పారు.
పాలకులు మారినా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని.. విద్యార్థులు తమ హక్కుల కోసం నిత్యం రోడ్డెక్కాల్సిన పరిస్థితి కొనసాగుతోందని కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి ప్రైవేట్ కళాశాలల కార్యక్రమాలకు హాజరవుతారని కానీ.. ప్రభుత్వ విద్యాసంస్థలపై తగిన దృష్టి లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారని, నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకే అప్పగించాలని ఏఐఎస్‌ఎఫ్ కోరుతోందని తెలిపారు.
కరీంనగర్ నుండి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ గుడికి, బడికి నిధులు తేలేదని కసిరెడ్డి దుయ్యబట్టారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడం తప్ప యువత విద్యార్థి కోసం చేసింది ఏమిటో చెప్పాలన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా విద్యార్థి, యువత చేస్తున్న పోరాటాలకు భయపడి వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నప్పటికీ, విద్యార్థుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. విద్యా భరోసా, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల వంటి హామీలను అమలు చేయకుండా, విద్యకు అధిక నిధులు విడుదల చేయకుండా రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు.
ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను ప్రకటించాలన్న ప్రభుత్వ ఆదేశం ఎంతవరకు అమలైందో వెల్లడించాలని.. పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో నీట్ ఉద్యమస్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై విద్యార్థులను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, రేణికుంట్ల ప్రీతం, మంద అనిల్, కుర్ర రాకేష్, సాయి ఆజాద్, మామిడిపల్లి హేమంత్, కనకం సాగర్, నాయకులు సామ వినయ్ రెడ్డి, కసిరెడ్డి సందీప్ రెడ్డి, అనోష్, బోయినీ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Also Read : పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు రూ.కోటి నజరానా
Follow Us On: X(Twitter)

