Mobile Popup Ad
Mobile Popup Ad

సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పాల్గొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం లక్ష్యంగా ఈ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య భద్రత పథకాలు తదితర సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు, వినతులు, సమస్యలను అధికారులు ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మేయ‌ర్‌ పేర్కొన్నారు. ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారానికి నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలు తమ సమస్యలను, అవసరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గత పాలకులు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మేయ‌ర్‌ పిలుపునిచ్చారు. చెట్ల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, మెరుగైన పర్యావరణాన్ని అందించగలమన్నారు. అనంతరం టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యల‌పై వినతిపత్రాలను సమర్పించారు.

Read Also: ఆసియన్ టూర్ టాప్-10లో కరందీప్ కోచ్చర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>