కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) లో ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతిక జాతర (Folk Cultural Festival) పోస్టర్‌ను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వేం నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. వావిలాల పల్లిలోని ఆల్ఫోర్స్ కేంద్ర కార్యాలయంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ (Karimnagar) ఫిలిం భవన్‌లో జరగనున్న జానపద సాంస్కృతిక జాతరకు నరేందర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న జానపద కళలు, పల్లె వాతావరణం, సహజ జీవనశైలిని భావితరాలకు అందించడమే జాతర ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, గ్రూప్ సాంగ్ కళాకారులు, మహిళా కోలాటం బృందాలు, బతుకమ్మ బృందాలు, వివిధ తెలంగాణ జానపద కళా ప్రదర్శనలతో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
కళాకారులకు ఉచితంగా ప్రదర్శన సర్టిఫికెట్లు అందజేస్తామని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కళలను సంరక్షించి భావితరాలకు అందించడమే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని స్పష్టం చేశారు. కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గవ్వ కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి, సంకల్ప సంస్థ సభ్యులు సముద్రాల ఓంకార్, ప్రముఖ జానపద కళాకారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

