కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana JAC) పిలుపు మేరకు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ (Karimnagar)లో ఉద్యోగులు నిరసనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో భోజన విరామ సమయంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు, ఇన్సూరెన్స్ బిల్లులు, జీపీఎఫ్ వంటి రాజ్యాంగబద్ధ హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 1 జులై 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నదని తెలిపారు.
రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి, ప్రతి నెల పైసా పైసా ప్రోగుదీసి ప్రభుత్వం వద్ద దాచుకుంటే… ఆ డబ్బులు మా పిల్లల పెళ్లిళ్ల కోసం, సొంత ఇల్లు నిర్మాణం కోసం, చేసిన అప్పులు తీర్చడానికి ఆరోగ్య అత్యవసరాల కోసం ఉపయోగపడాలన్నదే మా ఆశ అని, కానీ దాచుకున్న డబ్బుల కోసం మేమే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాము ఎవరిని ఉచితాలు కోరడం లేదని, ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలు కాదన్నారు. తమకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం అడుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డు అమలు, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం సమర్పించగా దాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, కటకం రమేష్, పేండ్యల కేశవ రెడ్డి, పిఆర్టియు కరుణాకర్ రెడ్డి, తిరుపతిరావు, జావిద్, రామ్మోహన్, ఆడేపు శ్రీనివాస్, కోట శ్యాం కుమార్, రేకం శంకర్, జయపాల్ రెడ్డి, సుంకిశాల ప్రభాకర్ రావు, చకినాల రామ్మోహన్, జాలి మహేందర్ రెడ్డి, చంద్రమౌళి, చింతపల్లి అశోకరావు, గోనె శ్రీనివాస్, ఎండి సలీం, దోనికేన సునీల్ కుమార్, చంద్రశేఖర్, ఆంజనేయరావు, సత్యనారాయణ రెడ్డి, గడ్డం సుధాకర్, డా. అరవింద్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, కిరణ్ కుమార్, శారద, సునీత, సబిత సరిత, కోట రామస్వామి, శంకర్, గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, జలాలోద్దీన్ అక్బర్, శైలజ, వీణ, సుస్మిత, మారుపాక రాజేష్, భరద్వాజ్, పూలు కిషన్, వాస్తవి గౌడ్, కోమ్మెర శ్రీనివాసరెడ్డి, విజయ్ కుమార్, వెలిచాల సుమంతరావు, అజ్గర్ అలి, లవ కుమార్, కమలాకర్, కరుణాకర్, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

