నేర సమీక్షలో పోలీసులకు సీపీ గౌష్ ఆలం కీలక ఆదేశాలు

కలం, కరీంనగర్ బ్యూరో: శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam), ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారాంతపు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సమావేశంలో సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, దేశంలో అమలులోకి వచ్చిన బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ చట్టాల నిబంధనలపై అధికారులు నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేరాల నమోదు, ఆధారాల సేకరణ నుంచి దర్యాప్తు వరకు ప్రతి ఘట్టాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రద్దీ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు రాత్రివేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమాజంలో అశాంతికి కారణమయ్యే చిన్నపాటి నేరాలు, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ-పెట్టీ కేసుల నమోదును ముమ్మరం చేయాలని సూచించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించే సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కమిషనరేట్ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అవగాహన సదస్సులు, క్రీడా పోటీలు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సీపీ పునరుద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్‌తో పాటు వివిధ సర్కిళ్ల సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>