కలం, వెబ్‌డెస్క్: ఈక్వెడార్‌లోని గ్వాయాక్విల్ నగరంలో ఉన్న ఓ చర్చి (Guayaquil Church) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అవర్ లేడీ ఆఫ్ పర్పెచ్యువల్ హెల్ప్ చర్చిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భారీ యేసు శిలువ ఫాదర్ పాట్రిసియో అల్ఫ్రెడో సాంచెజ్ మొలినారి తలపై పడింది. వేదికపై సరిగ్గా అమర్చకపోవడం వల్లే ఈ శిలువ పడిపోయిందని చర్చి ప్రతినిధులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స అందించారు. కానీ, తీవ్ర గాయాల కారణంగా ఫాదర్ తుదిశ్వాస విడిచారు. గ్వాయాక్విల్ ఆర్చ్‌డయాసిస్ ఈ విషాద ఘటనను ధృవీకరిస్తూ ఫాదర్ మృతికి సంతాపం ప్రకటించింది.
ఈ విషాదకర సంఘటన సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ అవుతుండగా చోటుచేసుకోవడం గమనార్హం. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే ఫాదర్ జీవితం అశాశ్వతత, దేవునిపై విశ్వాసం, కుటుంబంతో గడిపే సమయం ప్రాముఖ్యత గురించి భక్తులకు బోధించారు. ఫోన్లలో సమయం వృథా చేయకుండా దేవునికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రసంగించారు. తదుపరి ప్రార్థన ప్రారంభిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఫాదర్ తలపై శిలువ పడటంతో భక్తులు భయాందోళనలకు గురై కాపాడేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

