కలం, స్పోర్ట్స్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసర్ హుస్సేన్, మైకేల్ అథర్టన్లకు పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ వ్యాఖ్యాతల బృందంలో చోటు దక్కలేదు. పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక పాల్గొంటున్న ఈ సిరీస్ కోసం ప్రకటించిన ఆరుగురు సభ్యుల జాబితాలో వారి పేర్లు లేవు. అయితే, ఈ నిర్ణయానికి గల కారణాన్ని పీసీబీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ పరిణామానికి కొన్ని వారాల ముందు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కుమారుల ఇంటర్వ్యూ వివాదం తెరపైకి వచ్చింది.
ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన టెస్టు సందర్భంగా అథర్టన్.. ఖాసిమ్, సులేమాన్ ఖాన్‌లను ఇంటర్వ్యూ చేశారు. స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన ఈ ఇంటర్వ్యూలో, జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం, పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను అధికారులు నిర్లక్ష్యం, ఒంటరితనం ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుమారులు ఆరోపించారు. రోజులో 23 గంటలకు పైగా ఆయన చిన్న గదిలో ఒంటరిగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది.
ఇమ్రాన్ (Imran Khan) కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వైద్యులను కలవకుండా అడ్డుకోలేదని స్పష్టం చేసింది. ఈ ఇంటర్వ్యూపై పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్కై స్పోర్ట్స్‌కు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. నిరసనగా ఆటగాళ్లను మైదానం నుంచి వెనక్కి పిలిచే అంశాన్ని కూడా బోర్డు పరిశీలించినట్లు సమాచారం. తాజాగా ప్రకటించిన వ్యాఖ్యాతల జాబితాలో నాసర్ హుస్సేన్, మైకేల్ అథర్టన్లకు చోటు దక్కకపోవడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే, ఇంటర్వ్యూ వివాదానికి, తాజా ఎంపికకు మధ్య సంబంధాన్ని పీసీబీ ధ్రువీకరించలేదు.
Also Read : ఆసియన్ పారా గేమ్స్: మోనా ధమాకా.. భారత్‌కు గోల్డ్!
Follow Us On: Youtube

