నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు.. జగదీశ్ రెడ్డి ఫైర్

కలం, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా పట్టాలు తప్పిందని.. సీఎం, మంత్రుల దృష్టి కేవలం భూముల దోపిడీపైనే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఇతర పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి స్థానంలో తీసుకొచ్చిన ‘భూభారతి’ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కలిపి సుమారు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని ఆరోపించారు.

నీటి నిల్వలపై సమాధానం చెప్పాలి..

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 120 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 70 టీఎంసీలు మాత్రమే కనిపిస్తున్నాయని, మిగిలిన 200 టీఎంసీల నీరు ఏమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు.

చంద్రబాబు నీతి తప్పి.. రేవంత్ జాతి తప్పి..

నీళ్ల విషయంలో “చంద్రబాబు నీతి తప్పి.. రేవంత్ జాతి తప్పి” ప్రవర్తిస్తున్నారని  జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తక్షణమే కేఆర్ఎంబీకి లేఖ రాసి, ఏపీ నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.ఎడమ కాల్వ, వరద కాల్వ, ఏఎంఆర్పీ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. కేవలం 30 టీఎంసీల నీటితో మొదటి పంటను పండించుకోవచ్చని, ప్రభుత్వం వెంటనే నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది..

‘ఉదయ సముద్రం’ ఎండిపోతున్నా స్థానిక మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కన్నెపల్లిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోతలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలకు కారణం చెప్పాలని, కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిషన్ భగీరథను పక్కన పెట్టి కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు శాపంగా కాంగ్రెస్..

కాంగ్రెస్ పాలన తెలంగాణకు ఒక శాపంగా మారిందని, రైతులకు నీళ్లు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, నీళ్ల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రకు పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>