కలం, వెబ్ డెస్క్ : ఫ్రాన్స్లోని చారిత్రాత్మక లిమోజెస్ టౌన్ హాల్ భవనం శనివారం రాత్రి అగ్నిప్రమాదం (Limoges fire)లో తీవ్రంగా దెబ్బతింది. 1883లో ప్రారంభమై 143 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన భవనాన్ని ముసుగులు ధరించిన దుండగులు తగలబెట్టారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల సమయంలో ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
ఫ్రాన్స్ చారిత్రాత్మక కట్టడం దహనం
లిమోజెస్ నగరంలో నిరసనకారులు మొదట పోలీస్ వాహనానికి నిప్పు పెట్టి, భవనం అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత భవనంలో మంటలు రాజేశారు. క్షణాల్లో మంటలు పైకప్పు వరకు వ్యాపించడంతో ప్రసిద్ధ క్లాక్ టవర్, భవనం పైకప్పు కుప్పకూలిపోయాయి. లిమోజెస్ ప్రాంతీయ ప్రిఫెక్ట్ మోరిస్ బారేట్ మాట్లాడుతూ, భవనం అత్యధిక భాగం నాశనమైందని తెలిపారు.
హింసను ఖండించిన ఫ్రాన్స్ నాయకత్వం
ఈ ఘటన విచారకరమని, హెరిటేజ్ సంపదకు తీవ్ర నష్టమని అధికారులు పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెక్లేర్నుతో పాటు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ హింసాత్మక చర్యలను ఖండించారు. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనల్లోకి కొందరు దుండగులు ప్రవేశించి ఇటువంటి దాడులు చేశారని అధికారులు వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంటల్లో చారిత్రక సంపద
1883 జూలై 14న ప్రారంభమైన ఈ లిమోజెస్ టౌన్ హాల్ ఫ్రాన్స్ వాస్తుశిల్పానికి గొప్ప నిదర్శనంగా ఉండేది. ఇందులో ఉన్న అనేక చారిత్రక కళాఖండాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, భవనంలో సింహభాగం ధ్వంసమైంది.

