విధి వంచించిన తనయుల కోసం.. అమ్మల ఆరాటం

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో విధి వంచించిన తనయుల కోసం అమ్మలు పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా కన్నీరు రావాల్సిందే.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఆ తల్లుల పోరాటంపై “కలం” ప్రత్యేక కథనం.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ఖానాపురం, రుస్తోగి నగర్‌లో ఉండే కృష్ణవేణి, మంచానికే పరిమితమైన తన ఇద్దరు దివ్యాంగ పిల్లలకు 30 ఏళ్లుగా సపర్యలు చేస్తూ పంటి బిగువున బాధను భరిస్తుంది. పెద్దకొడుకు అనిల్ కుమార్‌కు 32 ఏళ్లు, కూతురు స్నేహాకు 30 ఏళ్లు. వీరు పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు. దీనికి తోడు భర్త రామక్రిష్ణ కుమారుడికి ఏడేళ్లు ఉన్నపుడు చనిపోవడం జరిగింది. ఇక అప్పటినుంచి కృష్ణవేణి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఖమ్మంలో తల్లి తండ్రుల ఇంట్లోనే ఉంటుంది. వారు కూడా వృద్ధులే కావడంతో కుటుంబ భారమంతా కృష్ణవేణి పై పడింది.

నలుగురి బాధ్యత ఆమె పైనే వుండడంతో బయటికి వెళ్ళి పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదల్లేని, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆహారం కావాలన్నా, నీళ్ళు కావాలన్నా అడగలేని వైకల్యం వారిది. దీంతో తల్లి ఇంటి పట్టునే ఉండి సంరక్షించాల్సి వస్తుంది. నలుగురు నిస్సహాయులను కేవలం పెన్షన్ డబ్బులతోనే కృష్ణవేణి పోషిస్తుంది. అవి వారి మందులకు, వైద్యానికి సరిపోక నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఉండటానికి సరైనా ఇల్లు కూడా లేని పరిస్థితి. దీనితో ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఏదైనా స్వయం ఉపాధి మార్గం చూపించాలని చేతులు జోడించి వేడుకుంటుంది.

మరో పక్క భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని దుమ్ముగూడెం మండలం దెబ్బనూతల గ్రామానికి చెందిన అరుణ అనే మహిళకు 2014 లో వివాహం అయింది. అభిషేక్ అనే బాబుకు జన్మనిచ్చింది. ఇతను కూడా వైకల్యంతోనే పుట్టడంతో, భర్త వదిలేసి వెళ్ళాడు. దశాబ్ద కాలంగా ఒంటరిగా ఉంటూ బాబు బాధ్యతలు చూసుకుంటుంది. బీటెక్ చదివిన అరుణ మారుమూల ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ కుమారుడికి చికిత్స చేయిస్తూ జీవనం కొనసాగిస్తుంది. ప్రస్తుతం కుమారుడు పెద్దవాడు కావడంతో, కూలీ పనులకు తీసుకెళ్లలేని పరిస్థితి. అలాగని ఇంట్లో ఒక్కడినే వదిలి పనికి వెళ్లలేదు. దీంతో పెన్షన్ డబ్బులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం తన చదువుకు తగిన ఉద్యోగం కల్పిస్తే, కొడుకుని కనిపెట్టుకుంటూ ఉండొచ్చని ఆశ పడుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>