చెస్ ప్రపంచంలో భారత్ గర్జన : ఒకేసారి ఇద్దరు ప్రపంచ ఛాంపియన్లు?

కలం, స్పోర్ట్స్ : భారత యువ చెస్ సంచలనాలు డొమ్మరాజు గుకేష్ (Gukesh), వైశాలి రమేష్‌బాబు (Vaishali Rameshbabu)లు సరికొత్త చరిత్ర సృష్టించారు. 19 ఏళ్ల గుకేష్, 24 ఏళ్ల వైశాలి తమ తమ విభాగాల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారు. ఒకే దేశం నుంచి ఒకే సమయంలో ఇద్దరు ఆటగాళ్లు ప్రపంచ టైటిల్ కోసం తలపడటం భారత చెస్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న గుకేష్ (Gukesh), అజేయంగా దూసుకొచ్చిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు జవోఖిర్ సిందరోవ్‌ను ఎదుర్కోనున్నారు. మరోవైపు కాండిడేట్స్ టైటిల్ గెలిచిన వైశాలి (Vaishali Rameshbabu), చైనాకు చెందిన ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ జు వెన్జున్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ మెగా ఈవెంట్ల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) త్వరలోనే బిడ్లను ఆహ్వానించనుంది. మే నెలలో దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ టెండర్‌లో బడ్జెట్, బహుమతి మొత్తం, స్పాన్సర్లు, ఇతర నిబంధనలను ఫిడే స్పష్టం చేయనుంది.

ఆయా దేశాల చెస్ ఫెడరేషన్ల ద్వారా మాత్రమే ఈ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఫిడే కౌన్సిల్ తుది వేదికను ఖరారు చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం, గుకేష్ ఆడే ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ 2026 నవంబర్-డిసెంబర్ మధ్య జరగనుంది. వైశాలి తలపడే మహిళల మ్యాచ్ 2027 వసంత కాలంలో నిర్వహించేలా తాత్కాలికంగా నిర్ణయించారు. అయితే, స్పాన్సర్లు, నిర్వాహకులు ఆసక్తి చూపిస్తే ఈ రెండు ఫైనల్స్ ఒకే చోట, ఒకే సమయంలో నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఈ ద్వంద్వ పోరు సాధ్యమైతే ప్రపంచం మొత్తం ఒకే వేదికపై ఇద్దరు భారత తారల పోరాటాన్ని వీక్షించవచ్చు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ల వేదికపై త్వరలోనే స్పష్టత రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>