కారులో పోరు.. సత్యవతి రాథోడ్‌ vs రెడ్యా నాయక్‌

కలం, వరంగల్ బ్యూరో: ఇద్దరూ ఒకే పార్టీ నేతలు.. కానీ ఎవరికి వారే అన్నట్లుగా తీరు ఉంటోంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ (Satyavathi Rathod), మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మధ్య రాజకీయ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద జరిగిన పరిణామాలు బీఆర్ఎస్‌ శ్రేణుల్లో ఆసక్తిని రేపాయి. రాష్ట్ర మహిళా నాయకత్వానికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఇద్దరు నేతలు తమ అనుచరులతో వేర్వేరుగా ఉండటం, మాజీ ఎంపీ కవిత జోక్యం చేసుకున్నా ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదనే ప్రచారం చర్చకు దారితీసింది.

ఒకే పార్టీలో ఉన్నా తగ్గని విభేదాలు..

రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్‌ నుంచి రెడ్యా నాయక్‌ తన కుమార్తెతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటికే పార్టీలో కీలకంగా ఉన్న సత్యవతి రాథోడ్‌, రెడ్యా నాయక్‌ వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ అప్పటి నుంచే ఉంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో విభేదాలు సమసిపోతాయని కార్యకర్తలు భావించారు. క్షేత్రస్థాయిలో మాత్రం రెండు వర్గాల మధ్య దూరం కంటిన్యూ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ ఎంపీ జోక్యం చేసుకున్నా కానీ..

కురవి ఆలయం వద్దకు రాష్ట్ర నాయకత్వం రాకముందే సత్యవతి రాథోడ్‌, రెడ్యా నాయక్‌ తమ అనుచరులతో వేర్వేరుగా ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ కవిత ఇద్దరు నేతలను కలిసి కూర్చోవాలని కోరారు. అయితే ఆ సమయంలో రెడ్యా నాయక్‌ స్పందించిన తీరు కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. రాష్ట్ర నాయకత్వం వచ్చిన తర్వాత నేతలు కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించినా, అంతర్గత విభేదాలపై మాత్రం స్పష్టత రాలేదనే ప్రచారం జరుగుతోంది.

వచ్చేసారి టికెట్‌పై చర్చ..

గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఓటమికి అంతర్గత విభేదాలు కూడా కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో డోర్నకల్‌ టికెట్‌ ఎవరికి వస్తుందనే దానిపై ఇద్దరు నేతల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు మరింత పెంచుతోంది. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసిపోవాలని చెబుతోంది. ఒకవేళ నేతల మధ్య సమన్వయం లేకపోతే పార్టీ కేడర్‌పై ప్రభావం పడుతుందనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అనుకున్నట్టుగానే ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు చల్లారలేదనే విషయం కురవి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకల్లో మరోసారి బయపడింది. ఇలాంటి పరిణామాలకు పార్టీ నాయకత్వం ఎలా ముగింపు పలుకుతుందనేది ఇప్పుడు కేడర్‌లో ఆసక్తిగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>