కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup) సమరానికి తెరలేస్తున్న వేళ ఆఫ్రికా ఖండం నుండి రసవత్తర అప్‌డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీ కోసం ఆఫ్రికా అగ్రశ్రేణి జట్లయిన ఘనా, సెనెగల్ తమ 26 మంది సభ్యులతో కూడిన తుది జట్లను మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించాయి. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్ల రాకతో ప్రపంచకప్‌లో ఆఫ్రికా పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. మొదటగా ఘనా జట్టు విషయానికి వస్తే, ఆ దేశ ప్రధాన కోచ్ కార్లోస్ క్విరోజ్ అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన ఒక సమతుల్యమైన జట్టును ఎంపిక చేశారు. ఈ 26 మంది జాబితాలో ముగ్గురు గోల్‌కీపర్లు, తొమ్మిది మంది డిఫెండర్లు, ఏడుగురు మిడ్‌ఫీల్డర్లు, ఏడుగురు ఫార్వర్డ్ ఆటగాళ్లు ఉన్నారు.
అయితే గాయాల కారణంగా స్టార్ ప్లేయర్లు మహమ్మద్ కుడుస్, అలెగ్జాండర్ జికు ఈ టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఘనా దేశానికి ఇది ఐదో ప్రపంచకప్ కావడం విశేషం. గతంలో 2010లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఘనా, బ్రెజిల్, ఖతార్‌లలో జరిగిన గత రెండు ప్రపంచకప్‌లలో మాత్రం గ్రూప్ స్టేజ్ దాటలేకపోయింది. ఈసారి గ్రూప్-ఎల్ లో చోటు దక్కించుకున్న ఘనా జట్టు.. జూన్ 17న పనామాతో జరిగే మ్యాచ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, క్రొయేషియా జట్లతో తలపడనుంది.
మరోవైపు, సెనెగల్ జట్టులో స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు సాడియో మానే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. 34 ఏళ్ల మానే ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్-నాస్ర్ తరఫున ఆడుతున్నారు. సెనెగల్ ప్రధాన కోచ్ పాపే థియావ్ ఎంపిక చేసిన ఈ 26 మంది జట్టులో ముగ్గురు గోల్‌కీపర్లు, ఎనిమిది మంది డిఫెండర్లు, ఏడుగురు మిడ్‌ఫీల్డర్లు, ఎనిమిది మంది ఫార్వర్డ్ ఆటగాళ్లు ఉన్నారు. సెనెగల్ జట్టు వివరాలు చూస్తే.. గోల్‌కీపర్లుగా ఎదురార్డ్ మెండీ, మోరీ దియావ్, యెహ్వాన్ దియౌఫ్ ఉన్నారు.
డిఫెండర్లుగా కాలిదౌ కౌలిబాలీ, మూసా నియాఖటే, మమదౌ సర్ర, అబ్దుల్లా సీక్, క్రెపిన్ దియట్టా, ఆంటోయిన్ మెండీ, ఇస్మాయిల్ జాకబ్స్, ఎల్ హజ్ మాలిక్ దియౌఫ్ ఎంపికయ్యారు. మిడ్‌ఫీల్డర్లుగా ఇద్రిస్సా గన గుయే, లామిన్ కమారా, పాపే గుయే, పాపే మాతర్ సర్ర, హబీబ్ దియారా, బారా సపోకో న్డియాన్, పాతే సిస్ బాధ్యతలు తీసుకుంటారు. అలాగే ఫార్వర్డ్‌లుగా సాడియో మానే, ఇస్మాయిలా సర్ర, ఇలిమాన్ న్డియాన్, నికోలస్ జాక్సన్, చెరిఫ్ న్డియాన్, బాంబా దియెంగ్, ఇబ్రహీమా ఎంబాయ్, అస్సానే దియావోలు బరిలోకి దిగుతున్నారు.
ఈ జట్టు గ్రూప్-ఐ లో ఫ్రాన్స్, నార్వే, ఇరాక్ జట్లతో పోటీ పడనుంది. ఈ ఏడాది జరగబోయే 2026 ఫిఫా ప్రపంచకప్‌నకు ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలోనే మొదటిసారిగా ఈ టోర్నీలో 48 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రికార్డు స్థాయిలో ఆఫ్రికా ఖండం నుండి పది జట్లు ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం.

