కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత వేణుగోపాలచారి (Former Union Minister Venugopalachari) హామీ ఇచ్చారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) శుక్రవారానికి 11వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని వేణుగోపాలచారి సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ సేవలను క్రమబద్ధీకరించే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

