కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఈడీ సోదాలు (ED Raids) చేపట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ సహా ఏడు ప్రాంతాల్లో అధికారులు కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రూ.326 కోట్లు రుణాలు తీసుకుని.. నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. స్పందించకపోవడంతో లోతుగా దర్యాప్తు చేయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టీల్ కొనుగోళ్లకు సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి.. బ్యాంకును మోసం చేసినట్లు తేలింది.
రహస్య ఖాతాలు సృష్టించి..
విచారణలో భాగంగా ఈడీ అధికారులు మరికొన్ని అంశాలను గుర్తించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకే తెలియకుండా రహస్య ఖాతాలు సృష్టించి.. నిధులను వాటిలోకి కూడా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులు ఈడీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. డైరెక్టర్ల ఇళ్లల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దారి మళ్లించిన నిధులతో పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు వివిధ సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

