కలం, స్పోర్ట్స్: ఈసారి ప్రపంచకప్ కేవలం సంచలన విజయాలు, అనూహ్య ఫలితాలకే పరిమితం కాలేదు. పలువురు గ్లోబల్ ఫుట్ బాల్ లెజెండ్స్ అంతర్జాతీయ కెరీర్‌కు భావోద్వేగ వీడ్కోలు (Football Legends Farewell) పలికింది. ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే తమ కల నెరవేరకపోవడంతో.. మైదానంలోనే వెక్కివెక్కి ఏడుస్తూ వారు వీడ్కోలు పలికిన దృశ్యాలు అభిమానుల గుండెలను పిండేశాయి.
క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)
రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 1-0తో పోర్చుగల్ ఓడిపోవడంతో 41 ఏళ్ల రొనాల్డో వరల్డ్ కప్ కల శాశ్వతంగా ముగిసింది. వరుసగా 6 వరల్డ్ కప్ గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించిన రొనాల్డో.. మ్యాచ్ ముగిశాక స్టేడియం టన్నెల్ గుండా కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిన దృశ్యం ఫుట్‌బాల్ చరిత్రలోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మోమెంట్‌గా నిలిచింది.
నెయ్మర్ జూనియర్ (బ్రెజిల్)
రౌండ్ ఆఫ్ 16లో నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం పాలైన తర్వాత నెయ్మర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కి కన్నీళ్లతో రిటైర్మెంట్ ప్రకటించాడు. గాయం కారణంగా టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయిన 36 ఏళ్ల నెయ్మర్ ఆఖరి నిమిషంలో పెనాల్టీ కొట్టినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ‘‘మెట్ లైఫ్ స్టేడియంలోనే నా ప్రయాణం మొదలైంది… ఇక్కడే ముగిసింది.. ఐ యామ్ సారీ’’ అంటూ పిచ్ పైనే కుప్పకూలి ఏడ్చేశాడు.
లుకా మోడ్రిచ్ (క్రొయేషియా)
క్రొయేషియా ఫుట్ బాల్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ్ లుకా మోడ్రిచ్‌కు కూడా ఈ ప్రపంచకప్‌లో కన్నీటి ముగింపే దక్కింది. పోర్చుగల్‌లో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో క్రొయేషియా ఎలిమినేట్ అవ్వడంతో 40 ఏళ్ల మోడ్రిచ్ చారిత్రాత్మక అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. 5 వరల్డ్ కప్‌లు ఆడి, ఒకసారి రన్నరప్, ఒకసారి థర్డ్ ప్లేస్ అందించిన ఈ ఐకాన్‌కు ప్రపంచం మొత్తం లేచి నిలబడి వీడ్కోలు పలికింది.
గిల్లెర్మో ఒచోవా (మెక్సికో)
మెక్సికో గోల్ పోస్ట్ లో సింహస్వప్నంగా నిలిచే ఐకానిక్ గోల్కీపర్ గిల్లెర్మో ఒచోవా (40) కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ను వీడాడు. రౌండ్ ఆఫ్ 16లో ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ పోరులో మెక్సికో 3-2తో ఓడిపోయాక, ఒచోవా అజ్టెకా స్టేడియంలోని అభిమానులకు చేతులెత్తి ముద్దులు పెడుతూ భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు.

