కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని టీఎన్జీవో(TNGO)ల భవనాన్ని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ (Maram Jagadeeshwar) సందర్శించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికి సన్మానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో పాటు ముందస్తు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం, శాలువాతో అందజేశారు.
ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అతిపెద్ద పండుగ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పూలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజిస్తారని, కానీ తెలంగాణలో పూలనే బతుకమ్మగా పేర్చి దేవతా స్వరూపంగా ఆరాధించడం మన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆడబిడ్డలను గౌరవిస్తూ, ప్రకృతిని పూజిస్తూ, కుటుంబ బంధాలను, ఆత్మీయతను చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని వివరించారు. ఈ పండుగలను ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇటీవల మైనారిటీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జలాలుద్దీన్ అక్బర్.. టీఎన్జీవోల భవనానికి విచ్చేసి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ (Maram Jagadeeshwar), జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి తదితర ఉద్యోగ సంఘ నాయకులను కలిశారు. టీఎన్జీవో సంఘంలో సుదీర్ఘకాలం పనిచేసి ఉద్యోగులకు సేవలందించిన అక్బర్ ప్రస్తుతం టీజీవో సంఘంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాయకులతో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా నాయకులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బాధ్యులు సర్దార్ హరేమేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్, గంగారపు రమేష్, లవకుమార్, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు కిషన్ సుధాకర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు తమ పదోన్నతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలు నిరంతరం కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read : పాతబస్తీలో అగ్నిప్రమాదం.. బాంబే హౌసరీలో చెలరేగిన మంటలు
Follow Us On: Youtube

