ఎల్‌నినో.. ఉపాధి పనులు విస్తరించాలి: కలెక్టర్ అనురాగ్

కలం, యాదగిరిగుట్ట: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) సూచించారు. గ్రామాల్లో కూలీలకు నిరంతరంగా పని కల్పించేలా అవసరమైన పనులను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలని ఆదేశించారు.

గుండాల మండలం పాచిల్ల గ్రామంలోని కట్ట మైసమ్మ కుంట వద్ద VB-G RAM G పథకం కింద చేపడుతున్న పనులను శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో పాల్గొంటున్న 52 మంది కూలీలతో నేరుగా మాట్లాడి, వారికి కల్పిస్తున్న పనులు, రోజువారీ వేతనాలు, పని దినాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనుల ద్వారా కూలీలకు అందుతున్న ప్రయోజనాలను పరిశీలిస్తూ, పనుల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఆరా తీశారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు ఉపాధి పనులు కీలకంగా మారుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి అందుబాటులో ఉన్న 125 రోజుల పని అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోజుకు రూ.308 వేతనం పొందేలా నిర్దేశించిన పనులను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని కూలీలకు వివరించారు.

ప్రతి గ్రామ పంచాయతీలో ముందస్తు కార్యాచరణ

మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించేలా పనులను ముందుగానే గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చే కూలీలకు పని కొరత లేకుండా నిరంతరంగా పనులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

అలాగే పనులకు హాజరయ్యే ప్రతి కూలీకి ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత పాటిస్తూ, కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో సంభవించే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ముందుగానే సిద్ధం చేయడం, కూలీలకు పని కల్పించడం, పథకం అమలును పర్యవేక్షించడం వంటి అంశాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, ఎంపీడీవో చండీ రాణి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>