ఆగారంలో నాలుగు నెలలుగా తాగునీరు వృథా..!

కలం, వనపర్తి: ఖిలా ఘణపురం మండలంలోని ఆగారం (Agaram) గ్రామంలో తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గత జూలైలోనే మండల పంచాయతీ అధికారికి (ఎంపీఓ) ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లా పంచాయతీ అధికారికి సైతం పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. పలు పత్రికల్లోనూ సమస్య ప్రస్తావనకు వచ్చినప్పటికీ అధికారుల్లో స్పందన లేదని వాపోతున్నారు. సమస్య ఏర్పడినప్పటి నుంచి గ్రామ పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తాగునీరు గంటల తరబడి వృథాగా పోతున్నా అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వర్షపాతం తగ్గడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతి చుక్కనూ కాపాడుకోవాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే పలుమార్లు సూచిస్తున్నప్పటికీ గ్రామస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడి తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి ఆగారం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిశీలించాలని, తాగునీటి వృథాను అరికట్టేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>