కలం, వరంగల్ : ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో డీజిల్ కొరత (Diesel Shortage) తీవ్రంగా నెలకొంది. జిల్లావ్యాప్తంగా అనేక పెట్రోల్ బంక్‌ల వద్ద “నో స్టాక్” బోర్డులు ప్రదర్శించడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ లభ్యం ఉన్న కొద్దిపాటి బంక్‌ల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు క్యూలలో నిలబడుతున్నారు. రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ప్రస్తుతం హార్వెస్టింగ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ వినియోగం అధికమయింది. దీంతో డీజిల్ డిమాండ్ మరింత పెరిగి, సరఫరా లోటు ఏర్పడినట్లు తెలుస్తోంది. డీజిల్ కొరత (Diesel Shortage) కారణంగా కొన్ని పెట్రోల్ బంక్‌లు పూర్తిగా మూతపడగా, మరికొన్ని బంక్‌లు పరిమితంగా ఇంధనం అందిస్తున్నాయి. నిన్న రాత్రి నుండి పెట్రోల్ డిమాండ్ కూడా అకస్మాత్తుగా పెరగడం గమనార్హం. ఇంధన లభ్యతపై స్పష్టత లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

