పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం ఇవ్వాలి: బీవీ రాఘవులు

‎కలం, నల్లగొండ: తీవ్ర పంట నష్టాలతో కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ (Nalgonda) లోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారని, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.

రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతే సమాన న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్‌ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు.

ఒకవైపు దేశ సమైక్యత గురించి మాట్లాడుతూనే, మరోవైపు ప్రజలను విభజించే విధానాలను అనుసరించడం సరికాదన్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా రూపకల్పనలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించి, వాటిని మరింత బలోపేతం చేసినప్పుడే దేశ ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>