Mobile Popup Ad
Mobile Popup Ad

తేజ‌స్వీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజనను పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఐ (CPI) కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చి రాష్ట్ర ప్రజలను అవమానించారని, ఆ స‌మ‌యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి ఆయన ప్రసంగాన్ని అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కోసం ఆనాడు బీజేపీ పోరాడిన విషయాన్ని మరిచిపోయారా అని, ఉద్యమకారులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బండి సంజయ్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు ఆయన వ్యాఖ్యలపై తక్షణమే స్పందించకపోవడం దారుణమని శ్రీనివాస్ అన్నారు.

గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ లాంటి వారు తెలంగాణ రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పదేపదే రాష్ట్ర విభజన పై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తూ మాట్లాడటం చూస్తుంటే రాష్ట్రంపై వారికి ఏమాత్రం ప్రేమ లేదని అర్థమవుతుందన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి, రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదింపచేసుకొని, రాష్ట్రాన్ని సాధించుకొని 16 సంవత్సరాలు గ‌డుస్తున్నా తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతున్న బీజేపీ నేతలను రాష్ట్ర ప్రజలు ఉపేక్షించకూడదని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా తిరిగి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా, పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాటిని అమలు చేయకుండా వివక్ష చూపుతున్నారన్నారు. మతోన్మాద ముసుగులో పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ నాయకులు పదేపదే తెలంగాణను చులకన చేసి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పార్లమెంట్ స్పీకర్ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించి సూర్య పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>