పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) తెలిపారు. గురువారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలు (Cotton Procurement) కేంద్రం ప్రారంభించారు. పత్తి తేమ శాతం పరీక్ష, తూకం ప్రక్రియను పరిశీలించి రైతులకు అందుతున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు, 18 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,669 కాగా, జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతం రూ.9,260 వరకు ధర చెల్లిస్తూ పత్తిని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌లో అత్యధిక ధర లభించడం రైతులకు ప్రయోజనకరమైన విషయమన్నారు.

పత్తిలో తేమ శాతం అధికంగా ఉండకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పత్తిని పూర్తిగా ఆరబెట్టి మార్కెట్‌కు తీసుకురావడం ద్వారా నాణ్యతను కాపాడుకోవడంతో పాటు మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో తేమ శాతం పరీక్షించే యంత్రాల వినియోగంపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని యంత్రాల ద్వారా పారదర్శకంగా పరీక్షించి, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతుల కోసం ‘రూపాయికే భోజనం’ పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంట వ్యర్థాలను కాల్చవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు దెబ్బతినడంతో పాటు భూసారం, నేలలో తేమ తగ్గే అవకాశం ఉందన్నారు. పంట అవశేషాలను భూమిలోనే కలిపి సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>