కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్‌పల్లి, ఆదర్శ్‌నగర్ ప్రాంతాలకు చెందిన 310 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు , అన్నపూర్ణ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) తో కలిసి ఇళ్ల పట్టాలను (Double Bedroom House Pattas) పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పేదలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 523 సర్వే నంబర్ పరిధిలో అనేక చిక్కుముడులు ఉన్నప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించి 310 కుటుంబాలకు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు కల్పించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు.
గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించినప్పటికీ, సరైన గుర్తింపు పత్రాలు, చట్టబద్ధమైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. ఇళ్లను వారసులకు బదిలీ చేసే విషయంలోనూ సమస్యలు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు చిక్కుముడులు రాకుండా అన్ని అంశాలను పరిశీలించి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ పట్టాలు కేవలం కాగితాలు కావని, కుటుంబాలకు భద్రత కల్పించే చట్టబద్ధమైన హక్కులని అన్నారు. రాబోయే తరాలు కూడా తమ ఇంటిపై గర్వంగా హక్కు ప్రకటించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే నాయకత్వానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పనిచేసే నాయకత్వానికి ఎంతో తేడా ఉంటుందని, మహబూబ్‌నగర్ నగరంలో గతంలో జరిగిన అక్రమాలు, ఆక్రమణలు, బెదిరింపులు, అక్రమ కేసులకు సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారాలు చూపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరికానికి కులం, మతం ఉండవని, అన్ని వర్గాల పేదలకు సమానంగా న్యాయం చేయడమే నిజమైన ప్రజాసేవ అని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ నగరాన్ని ఒక కుటుంబంగా భావించి, ప్రజలందరి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
523 సర్వే నంబర్ పరిధిలోని కాలనీని మహబూబ్‌నగర్‌లోనే ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇళ్ల పట్టాల పంపిణీతోనే తమ బాధ్యత పూర్తికాదని, కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం త్వరలో రూ.2 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాలనీలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల వంటి సదుపాయాలు అందుబాటులో లేని పక్షంలో వాటిని కల్పించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలు మురుగునీటి సమస్యలతో అనారోగ్యానికి గురికాకుండా రూ.603 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మహబూబ్‌నగర్‌ను సుందరమైన, ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక విద్య, ఉపాధి, సాగునీరు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని గుర్తు చేసిన ఆయన , పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు అవసరమైన నిధులు ఖర్చు చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో ప్రతిపాదించిన కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ను మరో అనువైన ప్రాంతానికి తరలించి, ఆ స్థలంలో ఫూలే–అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడేలా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచే గ్రంథాలయాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.
కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. క్రిస్టియన్‌పల్లిలో గత తొమ్మిది, పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యను పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని నిర్ణయించిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా క్రిస్టియన్‌పల్లిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి, లబ్ధిదారులకు వారి ఇళ్లపై హక్కులు కల్పించగలిగామని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు అందజేసిన పట్టాలు వారి హక్కులకు నిదర్శనమని, ఇళ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై హక్కులు లభించడం ఆనందదాయకమని అన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం జిల్లా యంత్రాంగానికి సంతృప్తినిస్తోందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఈ ఆనందంతో బతుకమ్మ, దసరా పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్టియన్‌పల్లిలో ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటే జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జి. మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, 10వ డివిజన్ కార్పొరేటర్ రమేష్‌తో పాటు ఇతర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

